జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ పేరుతో బీఆర్‌ఎస్ పోరాటం చేస్తోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో రైతు ధర్నా చేపట్టింది.
బీఆర్‌ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుంది. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉంది. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, మీరు కాదు. దేశంలో ఎక్కడా బోనస్ ఇవ్వట్లే. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారమూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. బీఆర్‌ఎస్ వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతి లేనే లేదు’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
‘విచారణ కేటీఆర్ మీద కొనసాగుతుంది. విచారణ ఎదుర్కొంటూ.. జడ్జి దగ్గరకు నేను వస్తా, నువ్వు వస్తావా అని అంటున్నాడు. వక్రీకరించే పనిలో కేటీఆర్ ఉన్నాడు. విచారణ ఫార్ములా ఈ రేసుపై జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికి కేటీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నాడు’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యరు. రైతులు పండించే సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే.