ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని గెలిపించాలని మంత్రి కోరారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విజయవాడ గాంధీజీ కాలేజీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి జాగారం చేసిన సందర్భంగా ఓటర్లు తక్కువగా వస్తున్నారు. ఈ ఓటర్లు అందరూ కూడా చదువుకున్న వారు, విద్యావంతులు. ఓటు హక్కు ప్రాధాన్య గురించి వారికి నేను చెప్పనవసరం లేదు. అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటర్లు అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. మూడుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఆలపాటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు’ అని అన్నారు.
‘కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో ఎలాంటి పాలన అందిందో ప్రజలందరూ చూశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంది. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉంది. ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తున్నాయో ప్రజలందరూ ఆలోచించాలి. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారు. అలాంటి కూటమి అభ్యర్థిగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలి. ఇప్పటి వరకు 25 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇది ఇంకా పెరగాలి’ అని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.