NTV Telugu Site icon

Graduate MLC: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. సాయంత్రం ప్రచారానికి తెర

Ap Mlc Elections

Ap Mlc Elections

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు లక్షల 15 వేల 267 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, వామపక్ష పార్టీల మద్దతుతో యుటిఎఫ్ అభ్యర్థిగా డి.వి. రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జి.వి. సుందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా రూటు మార్చింది. ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామంటూ ప్రకటించిన వైసీపీ పార్టీ ఇప్పుడు కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అనుచరులు, కార్యకర్తలంతా పీడీఎఫ్ బలపర్చిన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేసింది. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూపొందించిన ఓటర్ల జాబితాపై వైసీపీ ఆది నుంచి నిరసనను ప్రదర్శించింది. ఈ జాబితాలో పలు అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. అర్హతలేని పలువురికి ఓట్లిచ్చారంటూ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిష్కరించారు. తాజాగా వైసీపీ తీసుకున్న నిర్ణయానికి కూటమి షాక్‌లో ఉంది.

Read Also: Sajjan Kumar: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సంచలన తీర్పు.. కాంగ్రెస్‌ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో అందరూ టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరితో పాటు ఆరుగురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు.‌ వీరందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేస్తున్నారు. నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల నాయకుల మధ్య విభేదాలతో ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందా అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు 8 నెలల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం, డీఎస్సీ తొలి సంతకం చేసిన ఇంతవరకు ప్రకటన చేయకపోవడం కూటమి అభ్యర్థికి మైనస్ గా ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారాల్లో కూడా రాజశేఖర్ పేరు ఎదుట గడిలా ఒకటి అంకె వేయాలని ప్రచారం చేస్తున్నారు. దాదాపు రెండో ప్రాధాన్యత ఓటు వెయ్యవద్దని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు కనుక ప్రాధాన్యత క్రమంలో అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. క్రమ సంఖ్య ప్రకారం ఓటు వినియోగించుకోవాలి. క్రమసంఖ్య తప్పితే చెల్లని ఓటుగా పరిగణిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటులలో పోలైన ఓట్లల్లో ఎవరికి 50 శాతం పైగా ఓట్లు వస్తాయో వారు గెలిచినట్లుగా పరిగణిస్తారు. ఎవరికి రానిపక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో 50 శాతం ఓట్లు సాధించకపోతే కూటమి అభ్యర్థికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వైసీపీ, వామపక్ష పార్టీల మద్దతుతో యూటీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పీడీఎఫ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాఘవులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్వాతంత్ర అభ్యర్థుల్లో జీవి సుందర్ గట్టి పోటీ ఇస్తున్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడిగా దళిత సామాజిక వర్గాలలో పట్టు ఉంది. అందుకే సుందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. సుందర్ ఎంతవరకు ఓట్లు చీలుస్తారోనని ప్రధాన అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే….