NTV Telugu Site icon

Pocharam: అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను తక్కువ చేస్తే మా తడాఖా చూపిస్తాం

Pocharam

Pocharam

కామారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా ప్రవర్తిస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం.. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు.

Read Also: Republic Day 2024: భారతదేశంలో త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన ఆ మూడు ప్రదేశాలేంటో తెలుసా ?

అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్‌కు ఉన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికే ప్రభుత్వం కింద మీద పడుతుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే డబ్బులు జమ చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అయినా డబ్బులేమైనా ప్రింటింగ్ చేస్తారా? వచ్చిన ఆదాయాన్నే పంచాలని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెస్‌వి 420 హామీలని హేళన చేశారు. తక్కువ మెజార్టీతో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని.. లేదంటే బీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చేదని చెప్పుకొచ్చారు. 10 ఏళ్లు పరిపాలించాం.. కానీ రెండు నెలలకే ఇంత దౌర్జన్యం చేయలేదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.