Site icon NTV Telugu

Off The Record: పార్టీ మారలేదంటూ కడియం చరిత్రహీనుడయ్యారా?

Kadiyam

Kadiyam

పార్టీ మారలేదని స్పీకర్‌కు చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థులకు పొలిటికల్‌ టార్గెట్‌ అయ్యారా? నైతికతను ప్రశ్నిస్తూ నియోజకవర్గంలో చెడుగుడు ఆడేసుకుంటున్నారా? తవ్వకాలు జరిపి మరీ… పాత బైట్స్‌ వెలికి తీసి సోషల్‌ మీడియాలో సర్క్యులేషన్స్‌తో రచ్చ చేస్తున్నారా? ఏ ఎమ్మెల్యే విషయంలో ఆ స్థాయి హంగామా జరుగుతోంది? అక్కడే ఎందుకలా?

సార్…. నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించానన్న మాట అబద్ధం. కావాలంటే చూడండి… నా జీతం నుంచి ఇప్పటికీ నెలనెలా ఐదు వేల రూపాయలు బీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ఖాతాలోకి జమ అవుతూనే ఉన్నాయంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వివరణ ఇచ్చారు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బుధవారం స్పీకర్‌ను కలిసిన కడియం ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కావాలనే తనమీద బురద చల్లుతున్నారని, బయట వినిపిస్తున్న మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారాయన. తాను పార్టీ ఫిరాయించాననడం పచ్చి అబద్దమంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ వివరణే ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారిందట. గతంలో ఆయన పెట్టిన ప్రెస్‌మీట్స్‌, చేసిన కామెంట్స్‌, గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఓపెన్‌ స్టేట్‌మెంట్స్‌ని సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తూ… వీటికి సమాధానం చెప్పండి సారూ… అని ప్రశ్నిస్తున్నాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు.

అంతేకాదు.. స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు చెప్పిన వీడియో క్లిప్పింగ్స్‌ని కూడా బయటికి తీసి ప్రచారంలో పెట్టి పార్టీ మారారనడానికి ఇదే సాక్ష్యం అని చూపిస్తున్నారు. ఇక ఘన్‌పూర్‌లో కడియం ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య అయితే… డైరెక్ట్‌ వార్‌ ప్రకటించేశారు. స్పీకర్‌కు శ్రీహరి ఇచ్చిన వివరణ ఏ మాత్రం కరెక్ట్‌ కాదంటూ ఫైరైపోతున్నారాయన. పైగా…తన అఫిడవిట్‌ ద్వారా….కడియం శ్రీహరి చరిత్ర హీనుడిలా మిగిలిపోయారని, సభ్య సమాజం సిగ్గుపడేలా తన ప్రవర్తనను బయట పెట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకొని ఘన్‌పూర్‌ ప్రజల మధ్యకు వస్తావంటూ మరికొన్ని తీవ్ర పదాలను సైతం వాడేశారు రాజయ్య. నమ్మి గెలిపించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. నైతిక విలువలు ఉంటే MLA పదవికి రాజీనామా చేయాలి లేకపోతే వాడవాడల్లో నీ దిష్టి బొమ్మలు వేలాడదీస్తాంటూ హెచ్చరించారు రాజయ్య. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో రాజకీయ అగ్గి గట్టిగా అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

పల్లె పోరు ముగిశాక పొలిటికల్ హీట్ తగ్గుతుందని, మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికల దాకా ఉండబోదని అంతా అనుకుంటున్న టైంలో… బీఆర్‌ఎస్‌ నేతల మాటలు కాక రేపుతున్నాయి. కడియం శ్రీహరి అఫిడవిట్‌ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని లోకల్‌ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకవైపు చర్చ జరుగుతుంటే… మరోవైపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం చెడుగుడు ఆడేసుకుంటున్నాయి. నిజాయితీపరుడిని, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తానని తరచూ చెప్పే శ్రీహరికి ఉన్న విలువలు ఇవేనా అంటూ ప్రశ్నిస్తోంది కారు కేడర్‌. కారు కార్యకర్తల రియాక్షన్‌, రాజయ్య స్టేట్‌మెంట్స్‌ చూస్తుంటే…. ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడం లేదని, చాలా దూరం వెళ్ళే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలపై ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ హీట్‌ ఎంతదాకా వెళ్తుంది? ఆ మంటలు ఎవరెవరికి అంటుకుంటాయన్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version