బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. త్యాగాల కుటుంబమైన రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. సిగ్గేస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై అనుచితంగా, అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ బలుపుతో మాట్లాడటం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన సమయంలో కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని బీర్ల ఐలయ్య విమర్శించారు.
Also Read: Joe Root Record: రికీ పాంటింగ్ రికార్డు సమం.. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు చేరువగా జో రూట్!
రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ పని అయిపోయిందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ మధ్య పోటీ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలకు ఇప్పటికే అర్థమవుతోందన్నారు. సోనియా గాంధీ దయ వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, కేటీఆర్ మంత్రి పదవి పొందారని వ్యాఖ్యానించారు. ముందుగా కవిత చేసిన వ్యాఖ్యలపై, మీపై చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. కేటీఆర్ మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ.. రాహుల్ గాంధీ కుటుంబంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు స్పందించే రోజులు వస్తాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి పెంచాయి.
