Site icon NTV Telugu

WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్‌ ఫైర్!

Josh Hazlewood

Josh Hazlewood

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోష్ హేజిల్‌వుడ్‌పై ఆ దేశానికే చెందిన మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ మండిపడ్డాడు. జాతీయ జట్టు కన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. గత కొన్నేళ్లలో హేజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమవుతోందని ఆరోపణలు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిన నేపథ్యలో జాన్సన్‌ స్పందించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ 2025లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున జోష్ హేజిల్‌వుడ్‌ అద్భుతంగా రాణించాడు. 22 వికెట్లతో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్‌ 2025 చివరి దశలో గాయపడ్డ హేజిల్‌వుడ్‌.. ఆ తర్వాత కోలుకున్నాడు. లీగ్ వాయిదా పడడంతో కోలుకున్న అతడు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సమీపిస్తున్న దశలో ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌ ఆడాడు. ఐపీఎల్‌ 2025లో ఆడడం, డబ్ల్యూటీసీ ఫైనల్లో నిరాశపర్చిన నేపథ్యంలో మిచెల్‌ జాన్సన్‌ విమర్శలు గుప్పించాడు.

Also Read: Kommineni Srinivasa Rao: నేడు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల!

‘జోష్ హేజిల్‌వుడ్‌ జాతీయ జట్టు సన్నాహాల కంటే ఐపీఎల్‌ 2025లో పాల్గొనడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. గత కొన్నేళ్లలో హేజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ ఏమాత్రం బాగాలేదు. జాతీయ జట్టు సన్నాహల కన్నా.. ఆలస్యమైన ఐపీఎల్‌ కోసం తిరిగి వెళ్లడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిగ్ ఫోర్’ అయిన మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌లు ఒకప్పట్లా అద్భుతాలు చేస్తారని అనిపించట్లేదు. వీరికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సీనియర్‌ ప్లేయర్స్ యాషెస్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని అనుకుంటుంటే.. ఆ భావన సరైందేనా అని చూడాలి. ఇక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెస్టు ఆటగాళ్లను ఎంచుకోవడం మంచిది’ అని క్రికెట్ ఆస్ట్రేలియాకు మిచెల్‌ జాన్సన్‌ సూచించాడు.

Exit mobile version