ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మే 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 5 న చిలకలూరిపేట నియోజకవర్గంలోని, గణపవరం జడ్పీ హైస్కూల్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పొరపాట్లు జరిగినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అసలేం జరిగిందంటే.. ఎన్నికల విధులు నిర్వహించే బూత్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పేపర్లకు బదులుగా, ఈవీఎం బ్యాలెట్ పేపర్లను అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత ఓటర్లు ఈవీఎం బ్యాలెట్ పేపర్లతోనే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నమోదు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తీరా సాయంత్రానికి జరిగిన పొరపాటు తెలుసుకుని.. నాలుక కర్చుకున్నారు ఎన్నికల సిబ్బంది. జరిగిన పొరపాటును ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
READ MORE: Premalu : ఓటీటీలో అదరగొడుతున్న “ప్రేమలు” మూవీ తెలుగు వెర్షన్..
ఈ పొరపాటుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గణపవరంలో ఐదో తేదీన నమోదైన 1, 219 ఓట్లను ఇన్ వాలిడ్ గా ప్రకటించింది. రద్దయిన ఈ ఓట్లను రీపోలింగ్ ద్వారా మళ్ళీ నమోదు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది . పలనాడు జిల్లాలో జరిగిన ఈ పొరపాటుకు కారణమైన, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది, ఎన్నికల కమిషన్.