NTV Telugu Site icon

Venugopala Krishna: ఇది ఐబీ డైరెక్టర్ సీరియస్‌గా తీసుకోవాలి.. నిఘా వర్గాల నివేదిక పవన్‌కు ఎలా..?

Venugopala Krishna

Venugopala Krishna

Venugopala Krishna: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌ సీరియస్ గా తీసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించారు. ఇక, వాలంటీర్లపై పవన్‌ చేసిన కామెంట్లపై సీరియస్‌గా స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని ఐబీ సీరియస్‌గా తీసుకోవాలన్నారు.. నిఘా వర్గాలు నివేదికలు కేంద్ర హోం శాఖకు ఇస్తాయి.. కానీ, పవన్ కల్యాణ్‌కు ఎందుకు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఏపీలో మిస్ అయిన మహిళలు ట్రాఫికింగ్ కు గురయ్యారని ఆలోచించటం తప్పు అని హితబోధ చేసిన ఆయన.. పవన్ ఆలోచనలు అలానే ఉంటాయి అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవటం లేదు అన్నారు మంత్రి వేణు గోపాలకృష్ణ.. ఇక, చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను రెండు జిల్లాలకు పరిమితం చేశాడని విమర్శించారు. సొంతంగా పేరు ఉండటం వల్లే రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో గెలిచాడని.. కానీ, అందులో పవన్‌ కల్యాణ్‌ పాత్రే లేదని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కల్యాణ్‌వి నీచమైన ఆరోపణలు అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు ట్రాప్ చేసి పవన్ కల్యాణ్‌తో మాట్లాడించాడని దుయ్యబట్టారు. మిస్సింగ్ కేసులన్నీ ట్రాఫికింగ్ అవుతాయా? అని నిలదీశారు. మహిళలు అంటే ఎంత చులకనో పవన్ మాటలను బట్టి అర్థం అవుతుందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.

మరోవైపు.. ఎన్నికలకు సిద్ధం కావాలని కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు మంత్రి వేణు.. కానీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పథకాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగనన్న సురక్షా, గడప గడపకు మన ప్రభుత్వం బాగా చేయమని సీఎం జగన్‌ చెప్పారు.. మమ్మల్ని ఇంకా ఎక్కువగా కష్టపడాలి అన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.