Site icon NTV Telugu

Minister Venugopala Krishna: చంద్రబాబు బీసీలను నిలువునా ముంచాడు.. వంచించడానికే బీసీ డిక్లరేషన్‌..!

Venugopala Krishna

Venugopala Krishna

Minister Venugopala Krishna: చంద్రబాబు నాయుడు బీసీలను నిలువునా ముంచాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. 2014 ఎన్నికలలో 142 హామీలను బీసీలకు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూసారని మంత్రి ధ్వజమెత్తారు. పవన్ ను కలుపుకుంటే గంపగుత్తుగా కాపుల ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని, అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటేస్తారని అన్నారు. ఇక, బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ, జనసేనకు లేదన్నారు మంత్రి వేణు. ప్రతి హమీని అమలు చేసి సీఎం జగన్.. బీసీలకు న్యాయం చేశారని చెప్పారు. నిన్న బీసీ డిక్లరేషన్ చూసిన తర్వాత బీసీలే టీడీపీ, జనసేనను తిప్పికొడతారని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలందరూ చంద్రబాబు పాలనలో దగాపడ్డారని, మోసపోయారని పేర్కొన్నారు.

Read Also: PM Modi: రూ. 12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న ప్రధాని

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత లభించిందని మంత్రి వేణు చెప్పారు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీ స్థానాల్లో సీఎం జగన్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, అయితే చంద్రబాబు.. బీసీలు కేవలం కుల వృత్తి చేసుకోవాలని, జడ్జీలుగా కూడా పనికిరారని అభిప్రాయపడ్డ వ్యక్తిని అన్నారు. వైఎస్ఆర్ పీజు రీఎంబర్స్‌మెంట్‌ పెట్టిన తర్వాతే బీసీలకు ఉన్నత విద్యని అందిందని, ఇదే ఫీజు రీయింబర్స్మెంట్ ను చంద్రబాబు ముందుగానే ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు.. మరోసారి బీసీలకు అణచివేతకు సిద్ధపడుతున్నాడని విమర్శించారు. ఒక రూపాయి లేని వాడ్ని కూడా సీఎం జగన్ రాజ్యసభ సభ్యులు చేశారని ప్రశంసలు కురిపించారు. బీసీల ప్రత్యేక రక్షణ చట్టం అనేది పెద్ద అబద్ధం అన్నారు. బీసీల మీద దాడులు చంద్రబాబు హయాంలోనే జరిగాయని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి అమలు కావని, గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అంటూ వారిని చంద్రబాబు వెన్నుపోడిచారని అన్నారు. మొన్న ప్రకటించిన టీడీపీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? అని ప్రశ్నించారు.. అంతేకాదు.. బీసీలకు సీట్లు తగ్గించేసారని ఆరోపించారు. బీసీలు చైతన్యం చెందారని, చంద్రబాబు చెప్పే మాటలు నమ్మే వారు లేరన్నారు. డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో శేట్టిబలిజలకు ఎన్ని సీట్లు ఇచ్చావో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. బీసీలకు సీట్లు ఇవ్వకుండా రక్షణ చట్టం ఎలా తెస్తానని మండిపడ్డారు. తన సామజికవర్గానికే చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Exit mobile version