Minister Vangalapudi Anitha: కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశామన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తామని మంత్రి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
Read Also: Tirumala: 6 టికెట్లకు రూ.65వేలు.. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై భక్తుడి ఫిర్యాదు!
మరోవైపు ఇంటర్ విద్యార్థిని తల్లి హుస్సేనమ్మ తన కూతురి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. లేక లేక పుట్టిన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని.. ఆ దుర్మార్గుడిని కూడా పెట్రోల్ పోసి కాల్చి చంపుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కడుపుకోతకు కారకుడైన వాడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.