NTV Telugu Site icon

Tummala Nageswara Rao : రుణమాఫీపై వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికి బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళ పరిచి వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. వారికి అర్థమయ్యే విధంగా మరొక్కసారి వివరాలన్ని తెలియజేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు అని, వీరిలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉండి, తెలంగాణలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని ఆయన తెలిపారు. 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.  2018 రుణమాఫీ పథకం కనీసం 20 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదు. అదికూడా ఆఖరి సంవత్సరం చేసిన విషయాన్ని మీకు గుర్తుండే ఉంటుందన్నారు.

 

అంతేకాకుండా..’అలాకాక మా ప్రభుత్వం గుర్తించిన 42 లక్షల మందికి మొదటి పంటకాలంలోనే రుణమాఫీ 2024 అమలు చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.  వీరందరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కావాల్సిన మొత్తం అంచనా 31 వేల కోట్లు. వీరిలో 2 లక్షలలోపు రుణాలు తీసుకొని కుటుంబ నిర్దారణ చేసిన ఖాతాల సంఖ్య 22,37,848.  రుణమాఫీ చేసిన మొత్తం 17933.19 వేల కోట్లు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 2 లక్షలలోపు రుణాలను రుణమాఫీ చేశాము.  ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మిగతా 20 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదే.  ఆర్థిక వెసులుబాటు చూసుకుంటు ఇది పూర్తి చేస్తాము.  పైన సంబంధించిన లెక్కలలో మీకేమైన అనుమానాలు ఉన్నట్లయితే బ్యాంకువారిగా మీరు కూడా పర్యటించి వివరాలు తీసుకోవచ్చు.  ఇంత పారదర్శకంగా లెక్కలు ఉన్నప్పటికి, రుణమాఫీ 2024 పథకం పూర్తి అయినట్లు, మేము ప్రకటించినట్లు మళ్ళీమళ్ళీ అవే అబద్దాలు చెప్పి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు.  తుమ్మలకి మంత్రిపదవులు కొత్తకాదు. మంత్రిపదవి కోసమో, ఇతర పదవులకు ఆశపడో మాట్లాడే నైజం తుమ్మలది కాదు.  గత నెలలో కురిసిన భారీ వర్షాలవలన రైతువారి జరిగిన నష్టం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నివారణ కింద 10 వేల కోట్ల సహాయం ఆర్ధిస్తే కేవలం 400 కోట్లు మాత్రమే విధిల్చిన కేంద్ర ప్రభుత్వం, అక్కడ అధికారంలో ఉన్న బిజెపి పెద్దలను మీరేమన్నా ప్రశ్నించారా?

 

మీరు తెలంగాణలో మీ పరపతిని పెంచుకోవాలనుకుంటే, తెలంగాణకి వచ్చే నిధుల కోసమో, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రభుతంతరపున మీరు కూడా కేంద్ర ప్రభుత్వంపై పోరాడండి.  కేంద్ర ప్రభుత్వం వరికి ప్రకటించిన మద్ధతు ధర కంటే కూడా రూ.500 బోనస్ అధికంగా సన్న రకాలకు ప్రకటించి ఈ పంటకాలం నుంచే కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.  కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే దొడ్డు రకం రేషన్ బియ్యం ఎలా దుర్వినియోగం అవుతుందో మీకు తెలియంది కాదు.  ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మా ప్రభుత్వం మీద 2000 కోట్లు అదనపు భారం పడిన కూడా సన్న బియ్యం సేకరించి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డు దారులకు , అన్ని వసతి గృహాల విద్యార్థులకు సరఫరా చేయడానికి ప్రణాళిక చేశాము.  కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య పథకం ఆరంభించినపుడు 37 లక్షలుగా ఉన్నది. అది గత వాయిదాలో 30 లక్షలకు కుదించడం జరిగింది.  ఈ లెక్క గురించి కూడా సమాధానం చెప్తే తెలంగాణ రైతాంగం హర్షిస్తుంది.  ఇప్పటికైనా బిజెపి రాష్ట్ర నాయకులు నా గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచిస్తున్నాను.’ అని మంత్రి తుమ్మల అన్నారు.