‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్గా గుర్తించి.. అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.
Read Also: Software Jobs: బీటెక్ కుర్రాళ్లకు గుడ్ న్యూస్.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్
‘దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా గర్భ గుడిలో రెండు శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటి కాళేశ్వరునిది (యముడు). ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నాం. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అప్పుడు కోటి మందికి పైగా వచ్చే అవకాశముంది. సోమ్ నాథ్, కేదార్ నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేయోచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాం. దీని అమలుకు కేంద్రం సహకరించాలి. భక్తుల సౌకర్యార్థం పుష్కరాలు మొదలయ్యే నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలి’ అని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
Read Also: Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. ఒకరినొకరు కొట్టుకున్న బౌన్సర్లు!
‘రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉంది . రాముడి ఆలయాలు, జలపాతాలు, ఎన్నో ఔషధ మొక్కలు ఇక్కడున్నాయి. ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఆకర్షణలు ఇక్కడున్నాయి. ఈ కోటను సందర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి కోరారు.