NTV Telugu Site icon

Minister Seethakka: కేంద్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్ రాబోతోంది..

Seethakka

Seethakka

Minister Seethakka: రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు మారడం ఆనవాయితీ అని అన్నారు. ములుగు జిల్లా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు,వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. దేశంలో పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల అని ఆమె అన్నారు.

Read Also: Minister Uttamkumar Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనుమరుగు..

కేంద్రంలో అధికారంలోకి రాలేమని తెలిసిన బీజేపీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైల్లో పెడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ఇందిరమ్మ రాజ్యం అవసరమన్న మంత్రి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యమని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా ఇస్తామన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.