Minister Seethakka : సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయాల్లో, సామాజిక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, దీని ప్రభావం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క చిట్‌చాట్‌లో పంచుకున్నారు.
సీతక్క మాట్లాడుతూ, సోషల్ మీడియా తనకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. ముఖ్యంగా, తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, మానసికంగా ఆవేదనకు గురిచేసిన ఘటనలు బాధించాయని తెలిపారు. మరికొన్ని పోస్టులు ఆమెను డీమోరలైజ్ చేయడమే కాకుండా, ఆమె రాజకీయ ప్రయాణాన్ని దెబ్బతీసేలా చేశాయని పేర్కొన్నారు.
రాజకీయాల్లో మహిళలకు ఎదగడం అంత తేలికకాదని, అలాంటిది ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా కావాలని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను అబద్ధాలు ప్రచారం చేసేందుకు వాడుతుందనీ, నిజమైన వార్తల కంటే తప్పుడు ప్రచారమే ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు.
సీతక్క మాట్లాడుతూ, “సోషల్ మీడియాను నేను ఎప్పుడూ సామాజిక సేవకు ఉపయోగించుకున్నాను. కానీ, అదే ఇప్పుడు నా సమస్యగా మారింది,” అని తెలిపారు. కరోనా సమయంలో ఎంతో సేవ చేసినా, తనపై విమర్శలు ఆగలేదని అన్నారు. సోషల్ మీడియా ద్వారా కుటుంబాలపై, వ్యక్తిగత జీవితంపై దాడులు పెరుగుతున్నాయని, బాడీ షేమింగ్, మార్ఫింగ్ ఫోటోలు వంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో అవాస్తవాలను వ్యాప్తి చేసి, వ్యక్తిగతంగా బురద చల్లడం బాధాకరమని, కానీ “నిజం ఎప్పటికీ గెలుస్తుంది” అంటూ తన ధైర్యాన్ని ప్రదర్శించారు. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించాలని, దాన్ని చెడు ప్రయోజనాల కోసం వాడకూడదని ఆమె పిలుపునిచ్చారు.
మొత్తం మీద, మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మళ్లీ చర్చను తెరమీదకు తెచ్చాయి. మహిళా నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలనే అంశాన్ని మరోసారి గుర్తు చేశాయి.
US Missile Strike: యూఎస్ మిస్సైల్ దాడి.. ‘‘ఐసిస్’’ అబు ఖదీజా హతం..