NTV Telugu Site icon

Rammohan Naidu: మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.. రూ.11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కోరాం!

Rammohan Naidu

Rammohan Naidu

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం రూ.11,600 రూపాయలుగా నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించాం. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతాం’ అని చెప్పారు.

‘మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్నదే అందరం ఆలోచిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నిన్న ఢిల్లీలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎంతో మాట్లాడారు. ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం. ఉత్పత్తి వ్యయం రూ.11,600 కంటే ఎక్కువగా నిర్ణయించాలని ICARను కోరాం’ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.