Minister Peddireddy: వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను కలవడం.. ఆ తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.. హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆరణి శ్రీనివాసులు.. వైసీపీలో సీఎం వైఎస్ జగన్ తనకు అన్యాయం చేశారని.. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తనను అవమానించారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. అయితే, ఎమ్మెల్యే శ్రీనివాసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు ఇరవరం వద్ద కార్పెంటర్స్ ఎస్టేట్స్ కు భూమి పూజ చేసిన మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్పెంటర్స్ ఎస్టేట్స్ కు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: KTR: 6వ తేదీలోగా ప్రభుత్వం దిగిరాక పోతే.. న్యాయ పోరాటం చేస్తాం: కేటీఆర్
మరోవైపు.. చిత్తూరులో విజయనంద రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ నిలబెట్టారు.. విజయనందా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, ఎమ్మెల్యే ఆరిణి పార్టీకి ద్రోహం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు ఆరణి శ్రీనివాసులు అంటూ దుయ్యబట్టారు. జనసేన పార్టీలోకి వెళ్లారని తెలియడంతో పార్టీ అధిష్టానం.. వైసీపీ నుంచి శ్రీనివాసులును సస్పెండ్ చేసిందని వెల్లడించిన ఆయన.. అవసరమైతే అనర్హత వేటు వేస్తాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం విజయనందా రెడ్డి విజయానికి మనమంతా కృషి చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.