Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే..

Peddireddy On Chandrababu

Peddireddy On Chandrababu

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.

గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఈర లక్కప్పను, ఎంపీగా శాంతమ్మను గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారన్నారు.

గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఉండేవని.. వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని ఆయన విమర్శించారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదన్నారు. మడకశిర విజయం ప్రపంచమంతా గమనిస్తుందన్నారు. మడకశిరలో మిగిలిన రెండు మండలాలకు కూడా కృష్ణ జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రోళ్ళ రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. లక్కప్ప ఎమ్మెల్యేగా గెలుస్తారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కోరిన ప్రతి పని చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version