ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కాల్వల్లో సిల్ట్ తీయలేదు.. తట్ట మట్టి కూడా ఎత్తలేదు.. జగన్ నిర్వాకం వల్ల వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీసిల్టింగ్ పనులకు అంచనాలు రూపొందించాలని సూచించాం.. పట్టిసీమ నిర్వహణ లేకపోవడం వల్ల పంపులు ఆన్ చేయగానే కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.
కృష్ణా డెల్టాకు సాగు నీరు సమస్య ఉంది.. సాగర్ ఆయకట్టులోని రైతులకు ఇబ్బందులున్నాయని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే గోదావరి జలాలు తప్పని సరి అవుతోంది.. కృష్ణా నదిలో సరైన ఇన్ ఫ్లో ఉండడం లేదు.. పులిచింతలలో కేవలం అర టీఎంసీ నీటి నిల్వ కూడా లేకుండా పోయిందని అన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణాకు తాగు నీటి సమస్య కూడా వస్తోందని తెలిపారు. పట్టిసీమ లేకుంటే కృష్ణా ప్రజలు దాహార్తితో ఎండిపోయే పరిస్థితి వచ్చేది.. పోలవరంతో పాటు ఏపీలోని ప్రతి ప్రాజెక్టూ 20 ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు కోసం కొంత మేర ఖర్చు పెట్టినా.. వాటిల్లో సగం నిధులు వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయని అన్నారు. ఐదేళ్లూ సరైన పని లేక అధికారుల్లో నిర్లిప్తిత కన్పిస్తోందని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం రావడంలో ఉద్యోగుల పాత్ర కూడా ఉందని మంత్రి నిమ్మల తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులూ సహకరించాలని కోరుతున్నామన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ విషయంలో విదేశీ నిపుణులు నెలలో 10 రోజులు పరీక్షలు జరపాలి..
ప్రాజెక్టు సేఫ్టీ ముఖ్యం కాబట్టి.. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని దాదాపు నిర్ణయించామన్నారు. డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేయొచ్చనే ప్రతిపాదనలూ ఉన్నాయి.. అన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పట్టిసీమ పంపుల నుంచి నీటి విడుదల ప్రణాళికా బద్దంగా చేస్తున్నామని.. 15 పంపుల నుంచి నీటి విడుదల చేస్తున్నాం.. రెండు పంపుల్లో ప్రాబ్లం వచ్చిందని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో 21 పంపులూ వదులుతాం.. కాల్వగట్లను పటిష్టం చేయాలని సూచించాం.. గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి నిమ్మల చెప్పారు.