Minister Narayana: భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు తాజాగా జరిగాయి. ఈ రెండు విడివిడి సమావేశాలకు మంత్రులు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, ఫరూక్, పార్థసారథితో పాటు అధికారులు హాజరయ్యారు. సమావేశాల అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014-19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని.. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. అయితే, గత ప్రభుత్వం ఈ సంఖ్యను 2,60,000కు కుదించి, అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురిచేసిందని ఆయన విమర్శించారు. పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. సబ్ కమిటీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పూర్తిపై చర్చించినట్లు చెప్పిన మంత్రి, 2026 జూన్ నెలాఖరులోగా 2,60,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
అలాగే అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పినప్పటికీ, ఎవరికి అందాయో తెలియడం లేదని విమర్శించారు. ఎక్కడ లే-అవుట్లు ప్రారంభం కాలేదో, అక్కడ మళ్లీ కొత్తగా ఇళ్ల స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారికి రెండు లేదా మూడు సెంట్ల స్థలం ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందని ఆయన వివరించారు. మరోవైపు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై కూడా చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఒక గ్రూప్ కోసం ఎందుకు రాయితీ ఇవ్వాలనేది సుప్రీంకోర్టు చెప్పిందని, దీని సాధ్యాసాధ్యాలపై ఏజీ (అడ్వకేట్ జనరల్)తో చర్చిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు.
