Minister Narayana: మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు. 3600 కి.మీ రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం చేపడతామని.. ఎలాంటి మార్పు లేదన్నారు. 217 చ.గజాల్లో గతంలో 48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని.. అలా నిలుపుతామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగుతుందన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడిందని ఆయన విమర్శించారు.
Read Also: Minister Narayana: పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణ
రైతుల కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. గతంలో తనకున్న అనుభవంతో ప్రపంచంలో టాప్-5లో ఒకటిగా ముందుకు తీసుకెళతామన్నారు. గతంలో మా ప్రభుత్వంలో లో 48 వేల కోట్లతో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టామన్నారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా.. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందన్నారు. భూములిచ్చిన రాజధాని రైతులను గత ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. వైసీపీ అరాచక పాలనతో విసుగు చెంది ప్రజలు ఎన్డీఎకు అధికారం ఇచ్చారన్నారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పదిహేను రోజుల్లో అధ్యయనం చేసి టైం బౌండ్ నిర్ణయిస్తామన్నారు. రాజధాని పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామో చెబుతామని.. మూడు దశల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశామన్నారు. రాజధానిలో తొలి ఫేజ్ పనులకు 48 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. మూడు ఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని.. రాజధాని పై కోర్టుల్లో ఉన్న కేసులపై స్టడీ చేసి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.