అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు గ్రామ రైతులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి మంత్రి నారాయణ గ్రామ సభలో పాల్గొన్నారు. రాజధాని గ్రామాల అభివృద్ధి గురించి గ్రామస్థుల అభిప్రాయాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో ఇంకా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా గ్రామస్థులను అడిగి తెలుసుకుంటూ, వారి సూచనలను గమనించారు.
గ్రామస్థులు ప్రస్తావించిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ వెంటనే స్పందించారు. అడిగిన కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో, ఏ ఏ పనులు కొనసాగుతున్నాయో గ్రామస్థులకు వివరించారు. ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సుమారు రూ.900 కోట్ల వ్యయంతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read: Kambhampati Hari Babu: తెలుగు మహాసభల్లో పాల్గొనడం అపారమైన గౌరవంగా భావిస్తున్నా!
ఆరు నెలల్లోగా అన్ని రాజధాని గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తిగా కల్పిస్తామని రైతులకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
