NTV Telugu Site icon

Nara Lokesh: విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదు.. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తాం!

Nara Lokesh

Nara Lokesh

విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని, ఎలాంటి యాప్‌ల గొడవ ఉండదని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ‘వన్ క్లాస్-వన్ టీచర్’ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెలలోనే 16,473 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ చెప్పుకొచ్చారు.

ఈరోజు శాసనసభలో మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారు. ‘1994 నుంచి 2024 వరకు డీఎస్సీ ద్వారా 2 లక్షల 53 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తే.. అందులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లక్షా 80 వేల 22 పోస్టులు భర్తీ చేసింది. ఇది 71 శాతం, టీడీపీకి ఉన్న చిత్త శుద్ధి ఇది. రిజర్వేషన్ ప్రక్రియను నిర్ధారించడంలో ఈసారి డీఎస్సీ కాస్త ఆలస్యం అయింది. మార్చిలోనే 16,473 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం. విద్యా సంబంధిత అంశాలపై వైసీపీకి చెందిన సంఘంతో సహా అన్ని వర్గాలతో చర్చించాం. టీచర్ల సీనియారిటీ జాబితాను త్వరలోనే బహిర్గతం చేయబోతున్నాం. విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదు, ఎలాంటి యాప్‌ల గొడవ ఉండదు. గత ప్రభుత్వం ఐబీ సిలబస్‌ను అమలు చేసే రిపోర్ట్ కోసం ఐదు కోట్లు ఖర్చు చేసింది. ఉపాధ్యాయులను కూడా సిద్ధం చేయకుండా.. CBSE సిలబస్‌లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. అందుకే మూడు ఏళ్లలో అందరినీ సిద్ధం చేసి CBSEను అమలు చేస్తాం’ అని మంత్రి తెలిపారు.

వన్ క్లాస్-వన్ టీచర్ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యం తో ఉన్నాం. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్‌ను రూపొందిస్తున్నాం. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు బ్యాగ్‌ బరువు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పని చేయాలి. అప్పుడే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది’ అని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.