NTV Telugu Site icon

Minister Nara Lokesh: స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: పరిశ్రమల స్థాపనకు భారత్‌లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫోరమ్ చైర్మన్, జేసీ2 వెంచర్స్ వ్యవస్థాపకుడు జాన్ ఛాంబర్స్ అధ్యక్షత వహించారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విరాట్ భాటియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేష్ మాట్లాడుతూ… వేగవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించామన్నారు. ప్రైవేటు సెక్టారు ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటుచేశామని తెలిపారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలుచేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతివారం ఇన్వెస్టర్స్‌కు అప్ డేట్ చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా తొలివిడతలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా హౌస్ హోల్డ్ డాటా, ఎడ్యుకేషన్ డేటా మైక్రో లెవల్ లో సేకరిస్తున్నామన్నారు. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల సాధించాలన్న మా లక్ష్యానికి స్కిల్ సెన్సస్ దోహదపడుతుందన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ స్పూర్తితో 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. లాంగెస్ట్ కోస్ట్ లైన్ మాకు ఉందని మంత్రి చెప్పారు. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవడం మా లక్ష్యమని వెల్లడించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ
ఏపీలో వేగవంతమైన పారిశ్రామికాభివృద్దికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ..” ఐటి రంగంలో తెలుగు ప్రజల పాత్ర కీలకం. గతంలో చంద్రబాబుగారు పెద్దఎత్తున ఇంజనీరింగ్ కాలేజిలను ఏర్పాటుచేసి ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించారు. ఆయన కృషి కారణంగా వై2కె బూమ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఐటి అభివృద్ధి చెందింది. మాకు మంచి మ్యాన్ పవర్ ఉంది. విశాఖ నగరాన్ని ఐటి, కెమికల్, ఫార్మా, మెడికల్ డివైస్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఎపిలో పరిశ్రమలస్థాపనకు అవసరమైన ఎకోసిస్టమ్ కల్పిస్తున్నాం. అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధికి ఫోకస్ పాయింట్లను నిర్దేశించాం. రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజ్, పెట్రో కెమికల్, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తాం. 2029నాటికి 72 గిగావాట్స్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ” అని తెలిపారు.

స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… ఆయుధం!
నేడు వేగంగా మారుతున్న అధునాతన సాంకేతిక ప్రక్రియలో స్టార్టప్ అంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చే ఓ అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అంకురాల ద్వారా సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. గతనెలల్లో ఎపిలో సంభవించిన వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం ఓ నూతన అధ్యాయంగా అభివర్ణించారు. సెప్టెంబర్ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం తొలిసారిగా మా ప్రభుత్వం డ్రోన్‌ల వినియోగాన్ని ప్రారంభించింది. విజయవాడలో 40 కిలోల వరకు మోసుకెళ్లగల డ్రోన్‌లను వినియోగించాం. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

వరదల సమయంలో స్టార్టప్ ల సేవలు అద్భుతం
వరద నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లపై శాఖల నుంచి వచ్చే ఫిర్యాదులు ఆధారంగా రియల్ టైమ్ పరిష్కారాల కోసం అంకురాలను ఆహ్వానించామని లోకేష్ తెలిపారు. రికార్డ్ సమయంలో సమస్యలు పరిష్కారానికి స్టార్టప్ ఎకోసిస్టమ్ శక్తి తమకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. విశాఖకు చెందిన స్టార్టప్ ఫ్లూయంట్ గ్రిడ్ ద్వారా అభివృద్ధి చేసిన యాక్టిలిజెన్స్ అనే ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ సహాయక బృందాలు త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడింది. బాధితులకు బిస్కెట్లు, మ్యాగీ వంటి ఆహార సామగ్రిని అందించడానికి వీలు కల్పించే ఆన్‌లైన్ వ్యవస్థ దీని ద్వారా ఏర్పాటైంది. RINT_SS అనే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ కేవలం 2 రోజుల్లోనే ఫ్లడ్ ఎన్యూమరేషన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహాయం చేసింది. దీనిద్వారా బాధితుల గణన త్వరగా చేయటం, కేవలం 15రోజుల్లో పరిహారం బదిలీ చేయడానికి వీలు కల్పించింది. Sat_sure , జియోస్పేషియల్ డేటా అనలిటిక్స్ కంపెనీ వరద ప్రభావిత జోన్‌లలో వరద తీవ్రతను లెక్కించడానికి ఉపయోగపడింది. QoptarsL అనే అంకురసంస్థ డేటాను సేకరించేందుకు, కెమెరాలతో డ్రోన్‌లను మోహరించేందుకు సహాయం అందించింది. దోమలు, అంటు వ్యాధుల వ్యాప్తి జరగకుండా నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు అనలిటిక్స్ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ దోహదపడిందని మంత్రి లోకేష్ చెప్పారు.

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
4వసారి ఈ ఏడాది జూన్ లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ట్రిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సాధించిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, రాష్ట్రాన్ని ప్రగతిశీల సంస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో 10 కీలకమైన రంగాలను ప్రభుత్వం గుర్తించింది. పట్టణ, గ్రామీణ అవసరాలను పరిష్కరిస్తూ వివిధ రంగాల్లో సమగ్ర పురోగతి సాధించడానికి కృషిచేస్తున్నాం. అమరావతి అభివృద్ధి, నదుల అనుసంధానం, మెరుగైన నీటి నిర్వహణ, ప్రజలు-పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారించాం. మా ప్రభుత్వం పరిశ్రమలు, టూరిజం, సేవా రంగాలను ప్రోత్సహిస్తోంది, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, పునరుత్పాదక శక్తి, టెలికమ్యూనికేషన్స్, రసాయన తయారీ సబ్‌సెక్టార్లలో ప్రాధాన్యతలతో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం. ఉద్యోగ సృష్టి లక్ష్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ప్రైవేటు రంగం నుంచే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

మొబైల్ ఫోన్ ద్వారా 100రకాల సేవలు
“అమరావతిని వరల్డ్ క్లాస్ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దబోతున్నాం. ఫేజ్ -1 లో 100 రకాల ప్రభుత్వ సేవలను ఫోన్ ద్వారా అందించబోతున్నాం. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం ద్వారా మెరుగైన సేవలందిస్తాం. డిజిటల్ విధానంలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. గతంలో చంద్రబాబునాయుడు సైబరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలిపారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రైతుల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ సిటీగా తయారుచేసేందుకే ప్రణాళికలు సిద్ధంచేశాం. ఎస్ఆర్ఎం, విఐటి వంటి సంస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎపి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 92శాతం స్ట్రయిక్ రేటుతో 175కు 164స్థానాల్లో విజయం సాధించాం. ఇందులో 88 మంది ఎమ్మెల్యేలు, 17మంది మంత్రులు కొత్తవారు ఉన్నారు. ఎపి ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది.” అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.