NTV Telugu Site icon

Nadendla Manohar: గ్రామాల అభివృద్ధే గ్రామసభల‌ ముఖ్య ఉద్దేశం

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిప‌ర మండ‌లం వ‌ల్లభాపురంలో గ్రామ స‌భ‌లో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. గ్రామ స‌భ‌లో ప్రజ‌ల నుంచి వ‌చ్చిన అర్జీలు స్వీక‌రించి , వాటి పరిష్కారానికి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సోష‌ల్ ఆడిట్ స‌క్రమంగా నిర్వహించ‌లేదంటూ అధికారుల‌పై మంత్రి మ‌నోహ‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌నితీరు మెరుగుప‌రుచుకోక‌పోతే చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయ‌వ‌ద్దంటూ అధికారుల‌పై మండిపడ్డారు. తాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,మందుల సమస్యలు,మురుగు నీటి స‌మ‌స్యల‌ను మంత్రి మనోహ‌ర్ దృష్టికి గ్రామ‌స్థులు తీసుకువచ్చారు.

Read Also: Pawan Kalyan: వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటాం..

గతంలో స్పీక‌ర్‌గా ఉన్న తాను కోట్లాది రూపాయ‌ల‌తో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టానని మంత్రి వెల్లడించారు. గ్రామాల అభివృద్దే గ్రామ సభల‌ ముఖ్య ఉద్దేశమన్నారు. మూడు నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గ‌త ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. నిజాయితీగా పని చెయ్యని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దని.. యూరియా కంపెనీలలో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచుతామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు.