Minister Nadendla Manohar: ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలోని పడమట రైతుబజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచామన్నారు. విజయవాడ పటమట రైతు బజార్, గురు నానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్‌ను ఇవాళ మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంటనూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
Read Also: Minister Narayana: ఫ్లెక్సీలు, పోస్టర్లను నిషేధిస్తున్నాం.. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం..
రైతు బజార్లో సరుకులలో వ్యత్యాసంపై ఎస్టేట్ ఆఫీసర్‌ను నిలదీశారు. రైతు బజారులో బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తించి షాపుల నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. గురునానక్ కాలనీ ఉషోదయ సూపర్ మార్కెట్ సరుకుల ధరలు పరిశీలించినప్పుడు.. ప్రభుత్వం కందిపప్పు కిలో 67 వేల రూపాయలకు నిర్ణయించిన విధంగా అమ్మకాలు లేకపోవడానికి మంత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులను నిలదీశారు. అధిక ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, వంటనూనె రైతు బజార్లు, హోల్ సేల్, రిటైల్ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. పామాయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను లీటర్ 124 రూపాయలకు , కిలో 67 రూపాయలకే కందిపప్పు, వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు.