NTV Telugu Site icon

Jupally Krishna Rao: అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ హరీశ్‌ రావు స్పందిస్తారు!

Jupally Krishna Rao

Jupally Krishna Rao

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్‌ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్‌ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్‌ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.

‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి హరీష్ రావు వంద వాహనాల్లో యుద్ధానికి వెళ్లినట్టు వచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేకపోయారు. డబ్బులు లేక తవ్వలేదా ఎస్‌ఎల్‌బీసీ లేదా.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని తవ్వలేదా?. హరీష్ సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు. ప్రమాదం జరగగానే హరీష్ ఎందుకు రాలేదు. నేను ఒక్కడినే టన్నెల్‌ లోపలికి వెళ్ళాను. టన్నెల్‌లోకి వాటర్, బురద వచ్చి ముసుకుని పోయింది. అది తీస్తే మరలా వరద వస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.

‘జిల్లా మంత్రిగా నేనే టన్నెల్‌లోకి వెళ్లి వచ్చా. మమ్మల్ని రానివ్వలేదు అని కొందరు డ్రామా చేశారు. రావడానికి అనుమతి ఇచ్చింది మేమే, రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు. మీరేమైనా అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారా?. వచ్చి చూడాలి అనుకుంటే.. 100 వాహనాల్లో వస్తారా?. పాలమూరు రంగారెడ్డిలో ప్రమాదం జరిగితే కేసీఆర్ వచ్చాడా?.. పవర్ హౌస్ మునిగితే కేసీఆర్ వచ్చాడా?, మంత్రి వచ్చాడా?.. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే కేసీఆర్ వెళ్ళాడా?.. కాళేశ్వరం టన్నెల్‌లో ఏడుగురు చనిపోయినపుడు కేసీఆర్, హరీష్ పోయాడా?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.