NTV Telugu Site icon

Jagadish Reddy : అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు పీఎం ప్రయత్నం

Jagadish Reddy

Jagadish Reddy

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఉదయం విశాఖలో పర్యటించిన ప్రధాని మధ్యాహ్నం తెలంగాణకు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీ.. ముందుగా బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అనంతరం రామగుండంకు బయలుదేరిన ప్రధాని మోడీ అక్కడ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ హాట్‌ కామెంట్స్ చేశారు. ప్రతీ అక్షరం కేసీఆర్ పై విషం చిమ్మేలా మోడీ వ్యాఖ్యలు వున్నాయని మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. మునుగోడులో ఓటమి చెందిందనే మోడీ అక్కసు అని ఆయన వ్యాఖ్యానించారు. వడ్డీతో సహా ఇస్తారన్న మీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారని ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan: సినిమాల్లో మాదిరి ప్రజల్లోనూ నటిస్తున్నారు..! జీవితంలో పవన్‌ సీఎం కాలేరు..

బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని టీఆర్ఎస్ లో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు మోస పోవడానికి గుజరాత్ ప్రజలలాంటి వారు కాదని ఆయన అన్నారు. నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందిన ఆయన ఆరోపించారు. కేసీఆర్ పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, నీళ్లు.. పాలను వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామని ఆయన వ్యాఖ్యానించారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు పీఎం ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.