తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్ లో తెలంగాణ నీటి వాటాలపై 11 నెలలు అవుతున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణ వాడుకోలేకపోతుంది. 8 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది. 9,10 షెడ్యూల్ లోని అంశాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఏపీ విద్యుత్ సంస్థలు తెలంగాణకు 17,828 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాడు ఎస్పీడిసిఎల్ కింద తీసుకున్న అప్పు ఇతర అంశాలపై ఖర్చు అయ్యింది. కేంద్రం కక్ష్య సాధింపు ధోరణిలో ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణకు ఇవ్వాల్సిన సీఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఏపీకి ఇచ్చారు. వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఆస్తుల మెయిన్టనెన్స్ కోసం తెలంగాణకు 405 కోట్లు రావాల్సి ఉంది.
ట్రైబల్ యూనివర్సిటీ అతిగతి లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడ్రస్ లేకుండా పోయింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాల భూమి రైల్వేకి ఇచ్చాము. అయినా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. 1350 కోట్ల జీఎస్టీ నిధులు ఇవ్వడం లేదు. ఏ విషయం పైనా అయినా నాన్చుడు, పెండింగులో పెట్టడం కేంద్రానికి అలవాటు అయ్యింది. 23 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసాం. కేంద్రం పెండింగ్ ప్రభుత్వం, రాష్ట్రం స్పెండింగ్ ప్రభుత్వం. కేంద్రం రిక్తహస్తం చూపిస్తుంది. రైల్వేకు 1110కోట్లు ఇచ్చింది కేంద్రమని చెబుతున్నారు. రాష్ట్రం పెట్టింది ఎక్కువ 1904 కోట్లు రైల్వేకి రాష్ట్రం పెట్టింది.1100 కోట్లు కేంద్రం పెట్టింది. జాతీయ రహదారిపై 21676 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. మన రోడ్లు బ్యాంకుల్లో కుదువు పెట్టి మనకు నిధులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. విభజన చట్టంలో పెట్టిన హామీలు నెరవేరే వరకు కేంద్రం పై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
