డయాలసిస్ పేషంట్స్ కు ఆసరా పెన్షన్ కార్డులను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్ లో నగదు జమ చేశామని ఆయన వెల్లడించారు. పదివేల మందికి మొదటి సారిగా డయాలసిస్ కోసం ఇవ్వాలని నిర్ణయించామని, 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, వంద కోట్ల రూపాయలు డయాలసిస్ రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ ను మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తెలంగాణ ప్రభుత్వ విధానాలను మెచ్చుకొన్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 105 డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ట్రాన్స్ ప్లాంట్స్ చేసుకున్న వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరం అయిన వారికి 10 లక్షల ఆర్థిక సహాయం చూస్తున్నామని, ఒక సంవత్సరంకు 150 వరకు అవయవాల మార్పిడి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు భవిష్యత్ లో అవసరం అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఉచితంగా నిర్వహిస్తామని, స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్నామని, రాష్ట్రంలో హెల్త్ ఫ్రొఫైల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
