Site icon NTV Telugu

Gudivada Amarnath: చంద్రబాబు, ఆయన కొడుకు శిక్ష అనుభవించక తప్పదు..

Gudivada

Gudivada

Gudivada Amarnath: చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని దుయ్యబట్టారు. నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. రూ.118 కోట్లు లంచం తీసుకున్నారని ఆదాయపన్ను శాఖ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు.. గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు.. తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇక, ఆదాయపన్నుశాఖ తీగ లాగితే చంద్రబాబు డొంక కదలడం ఖాయం అన్నారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రం ఆస్తులు, ప్రజాధనం ఎలా దోపిడీకి గురైందో మొత్తం లెక్కలు బయటకు రానున్నాయన్న ఆయన.. ఐటీ శాఖ 46 పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే.. తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించాడు.. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా..? అని ఫైర్‌ అయ్యారు. అమరావతిలో దొంగతనం చేసి.. జ్యురిడిక్షన్ కాదని ఐటీ శాఖతో వితండ వాదన చేస్తున్నారని విమర్శించారు. మనోజ్ వాస్ దేవ్ పార్ధసాని అనే వ్యక్తి ద్వారా సబ్ కాంట్రాక్టు ద్వారా లంచాలు ఎలా తీసుకున్నారో ఐటీ అధికారులు రాబట్టారు.. 2016 నుంచి ఎంవీపీకి చంద్రబాబు కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. CRDA, హైకోర్టు, టిడ్కో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల దగ్గర నుంచి ముడుపులు అందాయని.. కోట్లు అంటే అందరికీ తెలుస్తామని టన్నులు అనే కోడ్ లాంగ్వేజ్ వాడారని.. చంద్రబాబే కాదు ఆయన కొడుకు పేరు ఐటీ జాబితాలో ఉందన్నారు.

చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ అని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అమర్నాథ్.. అవినీతి చరిత్ర అంతా రుజువులతో సహా బయటకు వస్తున్నాయి.. నువ్వు తుప్పు పట్టేసినోడివి.. నేను నిప్పును అంటే ఎవరు నమ్మరు అని ఎద్దేవా చేశారు. సీమెన్స్ వంటి కంపెనీని స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లోకి లాగిన ఘనుడు చంద్రబాబు. స్కిల్ డవలప్ మెంట్.. అమరావతి భూములు.. ఇలా ఎక్కడ చూసిన అవినీతికి పాల్పడి.. ఎందుకు నోరు మెదపడం లేదు..? అని నిలదీశారు. చంద్రబాబు ఆయన కొడుకు వాటాదారులు శిక్ష అనుభవించక తప్పదు అని వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. విదేశీ లావాదేవీలు ఉన్నందున “ఈడీ” ఎంటరై “కేడీ”ని పట్టు కోవాలని డిమాండ్‌ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Exit mobile version