NTV Telugu Site icon

Gangula Kamalakar : యావత్‌ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆహార ధాన్యాలు అందిస్తోంది

Gangula Kamalakar

Gangula Kamalakar

కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైశాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. రైతుల అవసరాలను, వారి ప్రాధాన్యతలను సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ గుర్తించి పరిష్కరిస్తుండడంతో రాష్ట్రంలో ధాన్యం సాగు గణనీయంగా పెరిగిందన్నారు. యావత్‌ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆహార ధాన్యాలు అందిస్తోందన్న మంత్రి గంగుల..తెలంగాణలో పండిన ధాన్యం సేకరణకు కేంద్రం అనేక కొర్రీలు పెట్టినా ప్రతీ గింజను కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా.. శ్రీలంక దేశం ఎదుర్కొన్న ఆహార సంక్షోభాన్ని చూసైనా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కేంద్రం వద్ద నిల్వల కొరత ఏర్పాడ్డాయని మంత్రి గంగుల మండిపడ్డారు.
Also Read : DK Aruna : ఇదంతా డ్రామా అని ప్రతిఒక్కరికీ అర్థమైంది.. నువ్వు ఇచ్చిన హామీల వీడియోలు ఒకసారి చూడు

2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ జరుగగా నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి గంగుల కమాలాకర్‌. నిధుల కొరత లేదన్న మంత్రి గంగుల.. గన్నీబ్యాగ్‌లు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తెలంగాణకు పక్క రాష్ట్రాల్లో పండించిన ధాన్యం వచ్చే అవకాశం లేకుండా అన్ని సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు.