తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోన బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణలో నిర్వహిస్తున్న సభలకు, సమావేశాలకు హాజరవుతున్నారు. సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయన్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమర్శలు చేసే ముందు తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నయా? ఆలోచించాలని ఆయన హితవు పలికారు. బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ప్రజలు ఆగం కావద్దని ఆయన సూచించారు. రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆయన అన్నారు.
