Site icon NTV Telugu

Damodar Raja Narasimha: ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్‌ను ఏర్పాటు చేయాలి..

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

Damodar Raja Narasimha: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కాలేజ్‌లలో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో రూపొందించిన యాక్ట్‌ 11పై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసి ఆస్పత్రి సిబ్బందికి ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళ నర్సింగ్ ఆఫీసర్లు , సిబ్బందికి రక్షణగా షీ టీంలతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని టీచింగ్ ఆస్పత్రులలో అవుట్ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులలో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాలన్నారు.

Read Also: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం

రాష్ట్రంలో 10 టీచింగ్ ఆస్పత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించామన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా PSAR (ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ – రెగ్యులేషన్స్) యాక్ట్‌ – 2015 ప్రకారం గుర్తింపు పొంది ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల ( PHC స్థాయి నుండి అన్ని ఏరియా హాస్పిటల్ల వరకు) ఆస్పత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానం చేయాలన్నారు. భద్రతపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించాలన్నారు.

ఆస్పత్రి వైద్య శాఖ అధికారులు, స్థానిక పోలీసులు సమన్వయం చేసుకొని భద్రతను బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రులలో మహిళ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై హాస్పిటల్ సేఫ్టీ కమిటీని నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో హాస్పిటల్స్ సేఫ్టీ కమిటీ భద్రతాపరమైన నియమాలను రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ నెల సెప్టెంబర్ 14వ తేదీ లోపు రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ

అలాగే, ఆస్పత్రి వైద్యులు నర్సులు భద్రతలో భాగంగా నమోదైన కేసులను యాక్ట్ 11 ఆఫ్ 2008 ప్రకారం రిజిస్టర్ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను వెంటనే సమర్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.ఉమ్మడి 10 జిల్లాల ప్రతిపాదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసుల విచారణ వేగవంతం అయ్యేలా కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హోం శాఖ, వైద్య ఆరోగ్యశాఖ విడివిడిగా సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, రాష్ట్ర ప్రజారోగ్యం , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఎస్పీఎఫ్ అధికారి త్రినాథ్‌ పాల్గొన్నారు.

Exit mobile version