NTV Telugu Site icon

Minister Botsa Satyanarayana: విధులకు హాజరు కండి, ఆందోళన విరమించండి.. అంగన్వాడీలకు విజ్ఞప్తి

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Minister Botsa Satyanarayana: అంగన్వాడీల అంశంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లో కూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు. జాయిన్‌ అవుతున్న అందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మరోసారి గుర్తు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామన్నారు. మీరు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామన్నారు.

Read Also: YS Sharmila: అస్సాం ఘటనపై రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి..

ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామన్నారు. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీ చేశామన్నారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామన్నారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్‌వాడీలను మరోసారి కోరుతున్నానని మంత్రి వెల్లడించారు. మీ ఆందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయన్నారు. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. బాలింతలు, శిశువులకు ఇబ్బందిరాకుండా వెంటనే మీ సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విధులకు హాజరు కాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరుతున్నామన్నారు. వారి సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.