Andhra Pradesh: ఫ్రీ హోల్డ్ స్కాంలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించారు. ఫ్రీ హోల్డులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై రెవెన్యూ శాఖ లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ బాగోతాలన్నీ బయటకు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు.
Read Also: Jogi Rajeev: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్
కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని.. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని మంత్రి వెల్లడించారు. నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే మూడు నెలల పాటు ఫ్రీ-హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశామన్నారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేస్తామన్నారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒరిజనల్ అసైనీలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే మా లక్ష్యమని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని మంత్రి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మంత్రి చెప్పారు. 20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముందన్నారు.