Site icon NTV Telugu

Tiger: వికారాబాద్ జిల్లాలో పులుల సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

Tiger

Tiger

వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుంది. దామగుండం అటవీ ప్రాంతంలో రెండు వారాలుగా సంచరిస్తున్న చిరుత తాజాగా నిన్న (సోమవారం) రాత్రి చీలాపూర్‌లో ప్రత్యక్షమైనట్లు స్థానికులు వెల్లడించారు. చీలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు మరో ఇద్దరితో కలిసి రాత్రి పొలం దగ్గర కట్టిన పశువులకు మేత వేసేందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. దారి మధ్యలో ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి ఆ పులి పొలాల వైపుగా పరుగులు తీసినట్లు వారు తెలిపారు.. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అయితే, చీలాపూర్ గ్రామం గుట్ట ప్రదేశంలో ఉండటంతో రాత్రి వేళ ఇళ్ల మధ్యకు పులి వచ్చేందుకు ఆస్కారం ఉందని ఎవరూ బయటకు రావొద్దని గ్రామ సర్పంచ్ రాములు హెచ్చరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. ఇక, పులి పాదముద్రలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Read Also: Bigg Boss7 Telugu : రతికాను సపోర్ట్ చేస్తున్న శివాజీ.. మరోసారి రెచ్చిపోయిన అమర్..

అయితే, వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతగిరి, దామగుండం అటవీ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఇక, పూడూర్‌ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మగపులి, అనంతగిరిలో ఆడవిలో ఆడపులి సంచరిస్తుందని పాదముద్రల ఆధారంగా గుర్తించారు. అధికారులు హెచ్చరికలతో సరిపెట్టకుండా ఎలాంటి ప్రాణహాని జరగకముందే పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అలాగే చెవేళ్ల మండలంలోని కౌంకుట్ల, అంతారం, తంగడపల్లి గ్రామాల్లో సైతం చిరుత పులి సంచరిస్తుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version