Site icon NTV Telugu

Cyclone Michaung: తుఫాన్ ఎఫెక్ట్‌.. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

Ap Rains

Ap Rains

Cyclone Michaung: బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండా.. మైపాడు తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. నెల్లూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Read Also: CM YS Jagan: తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో ఆస్తి, ప్రాణనాష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బందిని సమాయత్తం చేశామని ఆయన వెల్లడించారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు జిల్లా కలెక్టర్‌ సూచించారు. సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version