Michael Vaughan Hails Virat Kohli Batting in ICC ODI World Cup 2023: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని, టీమిండియాకు ఈసారి కచ్చితంగా వన్డే ప్రపంచకప్ అందిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ని చూస్తుంటే ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గుర్తొస్తున్నాడని, మెస్సీ అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించినట్టే కోహ్లీ కూడా భారత్‌కు కప్ అందిస్తాడని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుని ప్రపంచకప్ 2023లో కోహ్లీ బ్రేక్ చేస్తాడని వాన్ జోస్యం చెప్పాడు. ఎప్పుడూ టీమిండియాపై విషం చిమ్మే వాన్.. ఈసారి కాస్త అందుకు బిన్నంగా స్పందించడం విశేషం.
క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో మైఖేల్ వాన్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ‘ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ కంటే గొప్ప బ్యాటర్ ఎవరూ లేరు. ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందే కోహ్లీ 49వ సెంచరీ చేస్తాడు. ఫైనల్‌లో 50వ సెంచరీ బాదినా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ప్రస్తుత ఫామ్ అలాంటిది. సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుని ఈ టోర్నీలోనే బ్రేక్ చేస్తాడని నాకు అనిపిస్తోంది. ఇది స్టార్లకు మాత్రమే సాధ్యం అవుతుంది’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ అన్నాడు.
Also Read: Rohit Sharma Injury: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!
‘గొప్ప ప్లేయర్స్ ఎల్లప్పుడూ ప్రపంచకప్‌లలో సత్తాచాటుతారు. ఫుట్‌బాల్ ఆటగాళ్లను చూస్తే.. అర్జెంటీనా కోసం లియోనెల్ మెస్సీ ప్రపంచకప్ గెలిచాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రపంచకప్ (2011 ప్రపంచకప్) గెలిచాడు. కానీ భారత జట్టుకు అన్ని విధాలుగా తాను ముందుండి కప్ అందించండం వేరు. ఈసారి భారత జట్టుకి కోహ్లీ ప్రపంచకప్ అందిస్తాడు. ఈ టోర్నీలో భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. రోహిత్ సేనను ఓడించాలంటే టాప్ ఆర్డర్‌ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాలి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తప్ప మరే జట్టూ ఆ విషయంలో సక్సెస్ కాలేదు’ అని వాన్ పేర్కొన్నాడు.