Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!

  • మోడీ వీడియో తొలగింపుపై దుమారం
  • మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్
  • చట్టపరమైన రక్షణను తొలగిస్తామని వార్నింగ్
Modi

Modi

ప్రధాని మోడీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి మెటా తొలగించడంపై కేంద్రం సీరియస్ అయింది. మూడు రోజుల్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరమైన రక్షణను తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం-మెటా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. మెటా కంటెంట్ నియంత్రణ విధానాలపై తీవ్ర స్థాయిలో పరిశీలన జరుగుతున్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

మోడీ వీడియో తొలగింపుపై కేంద్రం పలు ప్రశ్నలు సంధించింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌పైనా చర్చ జరిగింది. మెటా వేదికల్లో చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను అరికట్టడంలో జరిగిన లోపాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలకు మెటా యాజమాన్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ఇటీవల యువతను ఉద్దేశించి చేసిన ‘జెన్-జీ అవుట్‌రీచ్’ వీడియోను తొలగించడం, ప్రభుత్వ నిబంధనలను మెటా పాటించలేదన్న ఆరోపణలు, మెటా వేదికల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌పై వస్తున్న ఫిర్యాదులు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. మోడీ వీడియోను తొలగించిన ఘటనపై మూడు రోజుల్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. లేదంటే మెటాకు చట్టపరమైన రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా మధ్యవర్తి సంస్థలకు ‘సేఫ్ హార్బర్’ రక్షణ లభిస్తుంది. వినియోగదారులు లేదా ఇతర వ్యక్తులు పోస్ట్ చేసే థర్డ్ పార్టీ కంటెంట్‌కు సంబంధించి మెటా వంటి సంస్థలను నేరుగా బాధ్యులను చేయకుండా ఈ నిబంధన కొంత చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది.

మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఈ బృందంలో మెటా వైస్ ప్రెసిడెంట్ నీల్ పాట్స్, సీనియర్ డైరెక్టర్ రాఫెల్ ఫ్రాంకెల్‌తో పాటు అమన్ జైన్, ప్రియా శ్రీనివాసన్ తదితర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ సమావేశానికి హాజరయ్యారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చెల్లింపు ప్రకటనల రూపంలో చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ కనిపించడంపై మెటా ఇప్పటికే నియంత్రణ సంస్థల పరిశీలనను ఎదుర్కొంటోంది. ఈ అంశంపై గత నెలలో కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో మోడీ వీడియో పొరపాటున ఎందుకు తొలగించబడిందో మెటా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు వర్గాలు తెలిపాయి. వీడియో తొలగింపునకు దారితీసిన సాంకేతిక, అంతర్గత ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై మెటా వివరణ ఇచ్చినట్లు సమాచారం.

సమావేశం ప్రారంభంలోనే దేశంలోని అన్ని సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేసే అంశం కాదని, చట్టబద్ధమైన బాధ్యతలను అమలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్రం వివరించినట్లు సమాచారం. తమ వేదికల్లో కఠినమైన అంతర్గత నిబంధనలు, ఫ్యాక్ట్‌చెకింగ్ వ్యవస్థలు ఇప్పటికే అమలులో ఉన్నాయని మెటా అధికారులు పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. తమ సోషల్ మీడియా వేదికలను ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసి దుర్వినియోగం చేసేందుకు అనుమతించబోమని మెటా స్పష్టం చేసినట్లు సమాచారం. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సమావేశం ముగిసినట్లు వర్గాలు వెల్లడించాయి.

పరీక్షా పేపర్ల లీకేజీల అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనలు జరుగుతున్న సమయంలో.. ప్రధాని మోడీ యువతను నేరుగా ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. యువతతో ఆయన నేరుగా మాట్లాడిన తొలి వీడియోగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో మోడీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి దాదాపు ఐదు గంటల పాటు తొలగించబడింది. అనంతరం వీడియోను తిరిగి పునరుద్ధరించారు. వీడియో తొలగింపుపై మెటా క్షమాపణలు చెబుతూ.. ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిన పొరపాటని వివరణ ఇచ్చింది.

అయితే మెటా వివరణపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందలేదని సమాచారం. సోషల్ మీడియా వేదికల్లో అల్గారిథమ్ పక్షపాతం, కంటెంట్ తొలగింపు విధానాలపై స్పష్టత ఇవ్వాలని మెటా గ్లోబల్ బృందాన్ని కేంద్రం సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై గురువారం మరో విడత సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మెటా అధికారులు సోమవారం పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం ముందు కూడా హాజరయ్యారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ప్రధానమంత్రి మోడీ వీడియోను తొలగించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని, వీడియోను ఎందుకు తొలగించారని కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం. అభ్యంతరకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో కొనసాగుతుండగా.. మోడీ వీడియోను మాత్రం ఎందుకు తొలగించారనే అంశంపై కూడా మెటా అధికారులను కమిటీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మోడీ వీడియో తొలగింపుపై తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న విధానాలు, కంటెంట్ నియంత్రణ ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

మరోవైపు విద్యార్థుల నిరసనల సమయంలో మోడీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదైనట్లు సమాచారం.

ప్రధానమంత్రి వీడియో తొలగింపు, సోషల్ మీడియా వేదికల్లో అభ్యంతరకర కంటెంట్, చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ నియంత్రణ వంటి అంశాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం-మెటా మధ్య కీలక చర్చకు దారితీశాయి. భారత చట్టాలు, నిబంధనలను అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేస్తుండగా.. కంటెంట్ నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు మెటా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.