Site icon NTV Telugu

PM Modi: పీఎం మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీ నిర్వహణకు నో పర్మిషన్

Pm Modi

Pm Modi

PM Modi: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గం సౌత్ తురాలోని పీఎ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24న షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అయితే అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున, సైట్‌లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని సమాధానం వచ్చింది. ఇక్కడ కాకుండా మరే చోటైనా సభ ఏర్పాటు చేసుకునేలా చూడాలంటూ బీజేపీకి సూచించింది.

Read Also: Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా

ఇక అదే స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే.. 127 కోట్ల రూపాయలతో నిర్మించిన అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియాన్ని గతేడాది 16న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా ప్రారంభించారు. ఇది జరిగిన రెండు నెలల అనంతరం ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పడమేంటని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా మాట్లాడుతూ ‘‘కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? వారు మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. మీరు (సంగ్మా) ప్రధానమంత్రి మోదీ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version