NTV Telugu Site icon

Medico Preethi : కలకలం రేపుతున్న మెడికో ప్రీతి ఘటన.. అసలేం జరిగింది..?

Medico Preethi

Medico Preethi

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియర్ విద్యార్ధి వేధింపులు తట్టుకోలేక దరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఎప్పుడు చలాకీగా ఉండే తన కూతురు అపస్మారక స్థితిలో బెడ్ పై పడి ఉండడానికి చూసినటువంటి మెడికో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రిలో సీనియర్ తన కూతురును వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్యయత్నం చేసుకొని ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఇదే విషయాన్ని మటవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

Also Read : Namrata Shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం

హైదరాబాద్‌లో రైల్వే పోలీస్ ఎస్సై‌గా పనిచేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్నారు.. మూడు నెలల క్రితం కేఎంసీలో చేరిన ప్రీతి వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత నెల నుండి ఆమెకు సీనియర్‌గా ఉన్న సైఫ్‌ అనే విద్యార్ధి ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడని ప్రీతీ కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడుతోంది. కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తన సీనియర్ హెచ్చరించడంతో లోలోన మదన పడుతుందని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఇటీవల ఆమె సోదరి వివాహం కోసం ఐదు రోజులు సెలవు పైగా హైదరాబాద్ వెళ్లింది. అయితే ఆమెకు మూడు రోజులు మాత్రమే సెలవు మంజూరు చేసి రెండ్రోజులు అబ్సెంట్ వేసినట్లు తెలిసింది.. ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత విద్యార్ధిని ముభావంగా ఉంటోంది.

Also Read : Stray Dog : కుక్కలే కాదు.. కుక్కల ప్రేమికులు కూడా కరుస్తున్నారు జాగ్రత్త..

ఎంబీబీఎస్‌లో ఏమి నేర్చుకున్నావని తమ కుమార్తెను హేళన చేయడంతో కుంగిపోయిందని ప్రీతి తండ్రి నరేందర్ ఆరోపించారు. దీంతో విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సీనియర్‌ని మందలించి ఇద్దరికి వేరు వేరు చోట విధులు కేటాయించారు. నిన్న రాత్రి నైట్ డ్యూటీ చేస్తున్న ప్రీతి తెల్లవారు జము వరకు బాగానే ఉందని ఉదయం 6 గంటల సమయంలో డాక్టర్స్ రూమ్ లో అపస్మారక స్థితిలో ప్రీతి ఉండడాన్ని గుర్తించి తోటి వైద్య విద్యార్థుల అధికారులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన చికిత్స అందించారు. కార్డియాక్ అరెస్ట్, లంగ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను గుర్తించి ఎంజీఎం వైద్యుల బృందం మొత్తం ఆమెకు అత్యవసర చికిత్స అందించారు

ప్రీతి కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో తాము చికిత్సపైనే దృష్టి పెట్టామని బాధ్యుడైన సీనియర్‌పై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని, మెడికల్ చట్టాల ప్రకారం అవసరమైతే రస్టికెట్ చేస్తామంటున్నారు ఎంజీఎం అధికారులు. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీ విచారణ చేపడుతుందన్నారు. వైద్య విద్యార్ధిని ఫిర్యాదు చేసిన వెంటనే తాము స్పందించామని, కాలేజీ ప్రిన్సిపల్ సీనియర్లను మందలించినట్లు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెబుతున్నారు.

అప్పటికే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ కావడంతో డిఎంఇకు సమాచారం అందించి నిమ్స్ తరలించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేశారా, మరేదైనా కారణం ఉందా అనేది తమకు తెలియదన్న అధికారులు విచారణ కమిటీ వేసి అసలు నిజాలు బయటికి తీస్తాం అంటున్నారు.

పీజీ వైద్య విద్యార్ధినిపై వేధింపుల వ్యవహారం తర్వాతి పరిణామాలపై ఘటన వరంగల్ పోలీసులు రంగం లోకి దిగారు. బాధితురాలి మొబైల్‌ ఫోన్ ఇతర ఆధారాలను పోలీసులకు స్వాధీనం చేశామన్నారు. సంఘటన స్థలం ఆమె డ్యూటీ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు. ఎంజీఎంలో మెడికో విద్యార్థి ఆత్మహత్యయత్నం సమాచారం తెలుసుకున్న కొండ సురేఖ ఎంజీఎం కి వచ్చారు. ఈ ఘటన పైనా ఇంటర్నల్ కమిటీ లేకుండా కలెక్టర్.. సీపీ స్థాయి అధికారులు విచారణ జరిపితే అసలు నిజాలు బయట పడతాయని, ఎంతో పేరున్న కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ లాంటి ఆరోపణలు రావడం మంచిది కాదన్నారు.

సీనియర్ల వేధింపుతో పీజీ చేస్తున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసుకుందన్న విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా వైద్య విభాగంలో చర్చకు దారి తీసింది. పీజీ లోనూ ర్యాగింగ్ జరుగుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పీజీ మెడికల్ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసుకుందా లేక అనారోగ్య కారణంతో అపస్మారక స్థితికి చేరుకుందా.. అనేది తేలాలంటే మరి కొంత సమయం పట్టేలా ఉంది. ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వైద్య విద్యార్థిని తేరుకొని జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారం ఇస్తే తప్ప పూర్తి వివరాలు బయటకు వచ్చేలా కనిపించడం లేదు.

Show comments