Site icon NTV Telugu

Medaram Jatara 2024: నేటి నుంచి మేడారం జాతరలో ప్రత్యేక పూజలు

Medaram

Medaram

Medaram: మేడారం జాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ఆరంభమవుతుందని పూజారులు పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఇవాళ ఉదయం నుంచి రేపు వేకువజాము వరకు కొనసాగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుపుతారు. కాగా, పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉంటుండే.. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి చెట్టుకొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ చేసుకునే వారు. దీన్నే మండమెలిగే పండగగా పిలుస్తారు. ఇక, పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేయనున్నారు.

Read Also: Today Gold Price: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!

కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. 21న కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెనెక్కడంతతో జాతర షురూ ప్రారంభమవుతుంది. అయితే, 22 రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దె మీదకు తీసుకు వచ్చేటప్పుడు భక్తజనం పోటెత్తుతారు. ఇక, 23 రోజున అమ్మవార్లకు భక్తులు మొక్కుబడులు సమర్పించుకుంటారు. ఇక చివరి రోజైన 24వ తేదీన అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. అయితే, రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు.

Exit mobile version