Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..

Fire Accident

Fire Accident

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని ప్లాస్టిక్ కుర్చీలకు అంటుకోవడంతో ఈ ప్రమాదం మొదలైంది. ప్లాస్టిక్ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే కంపెనీ అంతటా వేగంగా వ్యాపించాయి.

దట్టమైన నల్లటి పొగతో పాటు మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన కంపెనీ కార్మికులు వెంటనే అప్రమత్తమై ప్రాణభయంతో హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు నందిగామ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులను ప్రమాద స్థలానికి దూరంగా ఉంచుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఏమైనా ప్రాణనష్టం జరిగిందా లేదా కార్మికులు ఎవరైనా లోపల చిక్కుకున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.