Site icon NTV Telugu

Narsingi: తై బజార్‌ పేరిట గుటకాయ స్వాహా.. సర్కారు ఆదాయానికి గండి

Rythu Bazar

Rythu Bazar

Narsingi: తై బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ లో కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత 4 ఏళ్లుగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతి ఏడాది టెండర్ ప్రక్రియ చేపట్టడం ద్వారా 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో తై బజార్ వేలంపాట నిర్వహించకుండా కొందరు అవినీతికి పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఓ ఇద్దరు అధికారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత నాలుగేళ్లుగా తై బజార్ వేలం వేయకుండా ప్రైవేట్‌గా సంతలను నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

Read Also: Kishan Reddy: సికింద్రాబాద్‌లో నీలిట్ సెంటర్.. వర్చువల్ గా ప్రారంభించిన కిషన్ రెడ్డి

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై తక్షణమే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తై బజార్ వేలం పాటను నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బాధ్యులపై సమగ్ర విచారణ జరపకుండా చర్యలు తీసుకోకపోవడంపై నార్సింగ్ ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దానితోపాటు ట్రేడ్ లైసెన్సుల వ్యవహారంలో సైతం భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే మున్సిపాలిటీగా పేరుపొందిన నార్సింగ్ మున్సిపాలిటీలో కేవలం 600 ట్రేడ్ లైసెన్సులు మాత్రమే జారీ చేశారంటే నార్సింగ్ మున్సిపాలిటీకి ఆదాయం ఎంత కోల్పోతుందన్న విషయం జిల్లా ఉన్నతాధికారులు గమనించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పార్కులు, అక్రమంగా నిర్మించిన భవనాలపై సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తక్కువగా చేసి పనులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని నార్సింగ్ మున్సిపాలిటీని అక్రమార్కుల బారి నుంచి కాపాడాలంటూ జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version