NTV Telugu Site icon

Marriage Fraud: నిత్యపెళ్ళికూతురు..ఐదో పెళ్లికి రెడీ అవుతూ అడ్డంగా బుక్

Marriage Fraud

Marriage Fraud

మోసం జీవన వేదంగా మారిపోతోంది. ఎక్కడ చూసినా మోసం రాజ్యమేలుతోంది. భార్యను, భర్త.. భర్తను భార్య.. పిల్లల్ని తల్లిదండ్రులు ఏదో విధంగా మోసం చేస్తూనే వున్నారు. నిత్యపెళ్ళి కొడుకులు, పెళ్ళికూతుళ్ళ ఉదంతం బయటపడుతూనే వున్నాయి. తాజాగా చెన్నైలో నిత్య పెళ్ళి కూతురు ఉదంతం బట్టబయలు అయింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదో పెళ్ళికి సిద్దం అవుతుండగా భార్యను పట్టించాడు నాలుగో భర్త. విలాసవంతమైన జీవితం కోసం నలుగురు యువకులను ప్రేమించి పెళ్ళాడి నెల తిరగకముందే నగలు, నగదుతో ఎస్కేప్ అవుతుండడం అభినయకి అలవాటు. ఆమె దెబ్బకి అబ్బాయిలు లబోదిబోమంటున్నారు.

అచ్చం సినిమా స్టయిల్ లో ఆమె మోసం చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లిచేసుకోవడం తర్వాత అడ్డంగా ముంచేయడం అభినయకి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. దోచుకున్న డబ్బుతో విలాసాలు, టూర్లు కోసం, మేకప్ కోసం ఖర్చు చేసింది అభినయ. నలుగురిని పెళ్ళి చేసుకోవడమే కాకుండా మరికొందరితోనూ సరసాలు సాగించేది. చేసుకున్న భర్తలతో పాటు పరిచయం ఉన్న ప్రతి మగాడ్ని బుట్టలో వేసుకుని నగలు,నగదు దోచుకుంది అభినయ. తాజాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థలో పనిచేస్తున్న తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన నటరాజన్‌ కు అనాథగా పరిచయం చేసుకుంది అభినయ.

Read Also: Delhi Municipal Election: నేడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ, ఆప్ మధ్యే తీవ్ర పోటీ..

ఆగస్టు 29న ఆమెను వివాహం చేసుకున్నాడు నటరాజన్. పెళ్ళయిన నెల రోజుల తర్వాత అభినయ నగలు, నగదుతో పారిపోయేది. తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి అభినయను అరెస్టు చేశారు పోలీసులు. ఆమె నుంచి ఏకంగా 32 సిమ్‌కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న నగలు,నగదులో ఒక్కరూపాయి లేకుండా విలాసాలు, టూర్ కోసం ఖర్చు చేసింది అభినయ. ఆమె వల్ల మోసపోయినవారు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నిత్య పెళ్ళికూతుళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?