NTV Telugu Site icon

Margani Bharat: మాజీ ఎంపీ ప్రచార ‎రథాన్ని ‎తగలబెట్టిన ‎గుర్తు ‎తెలియని ‎వ్యక్తులు..

Margani Barath

Margani Barath

Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం దగ్గర ఈ వాహనం ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం అందించారు.

Read Also: SCO summit: కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..

ఇక, వెంటనే మాజీ ఎంపీ మార్గాని భరాత్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భరత్ రామ్‌ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారంటూ తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను.. ఇలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడటం దారుణమని మార్గాని భరత్ అన్నారు.

Read Also: T20 World Cup 2024 Final : తుది సమరానికి వేళాయె.. నేడే సఫారీలతో సమరం..

కాగా, ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారాక తిరుమలరావు దృ ష్టికి తీసుకుని వెళ్లి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం, ఇళ్ల పైకి రాళ్లతో దాడులు, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు పూర్తి విచారణ చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భరత్‌రామ్‌ డిమాండ్ చేశారు.