Site icon NTV Telugu

Maoist Party: “మాకు భద్రత కల్పించండి.. అందరం లొంగిపోతాం”.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టుల విజ్ఞప్తి..

Maoists1

Maoists1

Maoist Party: మావోస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తులు చేశారు. తమకు భద్ర కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ గృహ మంత్రి విజయ్ శర్మకు CPI (మావోయిస్టు) పశ్చిమ సబ్‌జోన్ బ్యూరోకు చెందిన కీలక నేత వికాస్ లేఖ రాశారు. ఆయుధాలతో సహా ప్రధాన ప్రవాహంలోకి చేరేందుకు సిద్ధమని ఆ లేఖలో వెల్లడించారు. బలాంగిర్–బర్గఢ్–మహాసముంద్ ప్రాంతాలకు చెందిన BBM డివిజన్ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ప్రజా యుద్ధం కొనసాగించడం సరైన మార్గం కాదని, భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయడమే ప్రజలకు మేలు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ భద్రతపై ప్రభుత్వ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ.. ఆ హామీని రేడియో ద్వారా నేరుగా వినాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత రెండు నుంచి మూడు రోజుల్లో బయటకు వచ్చి లొంగిపోతామని తెలిపారు. ఇప్పటికే మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ, 28 రోజుల ముందుగానే మహాసముంద్ జిల్లాలో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

READ MORE: Samantha : నాగ చైతన్యతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ పై సమంత ఎమోషనల్

అంతేకాదు.. లొంగుబాటు చేసిన మావోయిస్టులను ఇళ్లకు పంపకుండా బారక్కుల్లో ఉంచుతున్నారని, గడువు ముగిసిన తరువాత మళ్లీ కేసుల్లో ఇరికించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే మీడియా ద్వారా లొంగుబాటు నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో కూంబింగ్, ఎన్‌కౌంటర్ ఘటనలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో లొంగుబాటు చేయాలా, ఛత్తీస్‌గఢ్‌లో చేయాలా అన్న అంశంపై చర్చ జరిగినప్పటికీ, తమకు చెందిన ఇతర సభ్యుల అభిప్రాయంతో చివరికి ఛత్తీస్‌గఢ్‌కే రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక బృందం ముందుగా వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని, మిగతా సభ్యులు దశలవారీగా చేరతారని పేర్కొన్నారు.

READ MORE: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

ప్రభుత్వం ప్రకటించాల్సిన మూడు అంశాలు:
1. సాయుధ పోరాటాన్ని విరమించి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన మావోయిస్టు పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలి.
2. మావోయిస్టులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకొని, జైళ్లలో ఉన్నవారిని విడుదల చేయాలి.
3. భారత రాజ్యాంగ పరిధిలో బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి.

ఈ మూడు ప్రకటనలు చేస్తే జైళ్లలో ఉన్నవారు కూడా సాయుధ పోరాటాన్ని విడిచిపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పోలీసు చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తాము బయటకు వచ్చే వరకు గ్రామాల్లో కూంబింగ్ ఆపాలని, ప్రజలపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా రాష్ట్రంలోని బలాంగిర్, బర్గఢ్ జిల్లాల్లో కూడా పోలీసు ఆపరేషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో లొంగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, మాజీ మావోయిస్టు సాగర్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని లేఖ చివరలో పేర్కొన్నారు.

 

 

 

 

 

Exit mobile version