NTV Telugu Site icon

Maoist Party: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌటర్‌పై మావోయిస్ట్‌ పార్టీ కీలక ప్రకటన.. బలగాలపై ఆరోపణలు

Maoist Party

Maoist Party

ఛత్తీస్‌గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఇటీవల అబూజ్మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌పై తాజాగా మావోయిస్ట్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎన్కౌంటర్ జరిగిన 9 రోజుల తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి ఖండన వచ్చింది. బస్తర్ మాజీ డివిజనల్ కమిటీ మృతి చెందిన మావోయిస్టులకి నివాళులర్పించినట్లు పేర్కొంది. విప్లవకారులు, ప్రజానీకం తమ నెరవేరని కలలను సాకారం చేసుకునేందుకు దృఢ సంకల్పంతో పని చేయాలని తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ విజ్ఞప్తి చేసింది.

READ MORE: Salman Khan: ‘‘సల్మాన్ ఖాన్‌కి సహకరిస్తే చావే’’.. బాబా సిద్ధిక్ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..

ఇదిలా ఉండగా.. ఎన్‌కౌంటర్‌పై పార్టీ పలు ఆరోపణలు చేస్తూ పలు వివరాలు పేర్కొంది. “ఎన్‌కౌంటర్ జరిగిన రోజు ఉదయం 6 గంటలకు అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుమట్టాయి. అప్పుడే అన్నం తింటూ ఉండగా దాడికి పాల్పడ్డారు. ఒకే రోజు ఆరు సార్లు ఎదురు కాల్పులు జరిపారు. ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు కాల్పులు జరిగాయి. గ్రామం చుట్టూ భద్రతా బలగాలు మోహరించాయి. శిబిరాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే శత్రువులు ప్రతిఘటిస్తూ వెళుతుండగా మరో వైపు నుంచి అటువైపు అక్కడ కూడా కాల్పులు మొదలయ్యాయి. ధైర్యంగా ఎదురు కాల్పులు ప్రారంభించాం. భద్రతా బలగాల విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది సహచరులు చనిపోగా 12 మంది సహచరులు గాయపడ్డారు. 15 నిమిషాల ప్రతిఘటన తర్వాత మళ్లీ గాయపడిన సహచరులతో కలిసి వెళ్లాం. నాల్గవసారి మళ్లీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో నలుగురు సహచరులు గాయపడ్డారు. అక్కడి నుంచి 30 నిమిషాల దూరం వెళ్లిన తర్వాత శత్రువులు ఎల్ ఫార్మేషన్‌లో కూర్చుని కాల్పులు జరిపారు. ఇక్కడి నుంచి రెండు జట్లు విడిపోయాయి. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు రాత్రి 9 గంటల వరకు అడపాదడపా 11 సార్లు కొనసాగాయి. అన్ని కాల్పుల్లో మా సహచరులు 14 మంది మృతి చెందారు. గాయపడిన 17 మంది మావోయిస్టులను పట్టుకుని 5వ తేదీ ఉదయం 8 గంటలకు భద్రతా బలగాలు కాల్చి చంపారు. అమరవీరులందరినీ స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహించాం.” అని బస్తర్ డివిజనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.