KTR: మణుగూరులో బీఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు జెండా ఎగురవేశారు. ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని పేర్కొన్నారు. “60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుంది. త్వరలోనే మణుగూరును సందర్శిస్థాను.. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోంది.. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉంది..” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE: Mahabubnagar: ప్రభుత్వ టీచర్‌కు టెండర్‌లో మద్యం షాపు.. ఉద్యోగం గోవింద..!
అసలు ఏం జరిగింది..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. నాడు అధికారం అండతో రేగా కాంతారావు చేసిన చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆ కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కార్యాలయం కోసం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారు. ఆ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఇది తానే నిర్మించానని.. తనకే చెందుతుందని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు రేగా కాంతారావు. అయితే మొన్నటి ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈ కార్యాలయంలోకి చొరబడి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రి, కుర్చీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.